
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధి మోదెల శివారులోని టేకు చెట్ల వద్ద పాయిజన్ కలిపిన బీరు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల అనిల్ (22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ కూతురుని ప్రేమిస్తున్నాడు. అది ఇష్టంలేని అతడు కక్షగట్టి ఈ నెల 15న మృతుడిని బెదిరించాడు. దీంతో పాయిజన్ కలిపిన బీరు తాగడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. టేకు చెట్ల వద్దకు తీసుకువెళ్లి బీర్లలో పాయిజన్ కలిపి బలవంతంగా ఎవరైనా తాగించారా! లేదా బెదిరింపులకు భయపడి మృతుడే కలుపుకుని తాగాడా! అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా, టేకు చెట్ల వద్దకు తీసుకువెళ్లి మెడపై కత్తి పెట్టి పాయిజన్ కలిపిన బీరును బలవంతంగా తాగించారని మృతుడు తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లక్షెట్టిపేట ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.