Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 March 2023, 9:02 am Posted by : Anjaneyulu Dega

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పోలీసులపై దాడి

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: పీకలదాకా మద్యం సేవించిన ఓ యువకుడు అతని మిత్రుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులపైనే దాడికి దిగిన ఘటన జగిత్యాల జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తనిఖీలు చేపట్టిన పోలీసులపైనే దాడి చేసి విధులకు ఆటంకం కలిగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ రామ్ తెలిపిన వివరాల మేరకు గొల్లపల్లి రోడ్ లో మంగళవారం రాత్రి ట్రాఫిక్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా బైక్ పై వచ్చిన పట్టణానికి చెందిన దయ్యాల మహేష్, చెట్ట మహేందర్ లను తనిఖీల నిమిత్తం సిబ్బంది ఆపారు. అనంతరం బైక్ నడిపిన మహేష్ కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసే క్రమంలో నిరాకరించాడని తెలిపారు. అంతేకాకుండా మరో యువకుడు మహేందర్ తో కలిసి టెస్ట్ చేయడానికి మీరు ఎవరు రా అంటూ పోలీసులపై ఇష్టారీతిన అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న హోంగార్డుపై దాడి చేసి కొట్టారని పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డా ఇద్దరిని ట్రాఫిక్ ఎస్ఐ రామ్ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు హోంగార్డ్ రాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు.