వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రక్షిత(20) భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతులు కుమార్తె.
ఆంజనేయులు న్యూస్, వరంగల్ ములుగు: వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రక్షిత (20) భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతుల కుమార్తె. నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. స్వగ్రామంలో పదో తరగతి చదివే రోజుల్లో ఆమెకు పరిచయమైన రాహుల్ కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని భయభ్రాంతులకు గురిచేశాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు రక్షిత చెప్పగా వారు భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతడిలో మార్పు రాలేదు. శివరాత్రికి భూపాలపల్లికి వెళ్లిన రక్షిత కళాశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరింది. కానీ, కళాశాలకు చేరుకోలేదు. దీంతో తమ కూతురు కనిపించడం లేదని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. హాస్టల్లో ఉంటే ఇబ్బంది అవుతుందంటూ వరంగల్ రామన్న పేటలోని తన సోదరుడి ఇంటికి తండ్రి శంకర్ పంపించాడు. మిస్సింగ్ కేసు విషయంలో సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉండగా ఆదివారం రక్షిత తన బాబాయి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి కాంట్రాక్ట్ పనిమీద ఝార్ఖండ్ వెళ్లారు. రాహుల్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.