Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 January 2023, 9:58 pm Posted by : Anjaneyulu Dega

జంతువుల పట్ల ప్రేమతో వ్యవహరించాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భూమిపై మనతో పాటు జంతువులకు సైతం జీవించే స్వేచ్ఛ, హక్కు ఉన్నాయని, వాటి పట్ల ప్రేమతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఈ నెల 14 నుండి 31వ తేదీ వరకు జరుగుతున్న జంతు సంరక్షణ పక్షోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ట్రైనీ కలెక్టర్ గౌతమి, పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు రమేష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మనతో పాటు జీవిస్తున్న ప్రతి జీవిపై కరుణ, దయ చూపాలని, మనం పెంచుకునే పెంపుడు జంతువులతో పాటు వీధులలో సంచరించే జంతువులకు ఆహారం, నీరు అందించాలని తెలిపారు. జంతు సంరక్షణ కేంద్రంలో వీధులలో సంచరించే కుక్కలకు సంతానోత్పత్తి నియంత్రణ చేయగలిగితే రాబిస్ వ్యాప్తిని అరికట్టగలుగుతామని తెలిపారు. మనుషులుగా మనకు గల బాధ్యతలను నిర్వర్తించాలని, సమాజంలో మనతో పాటు జీవించే జంతువులతో స్నేహపూర్వకంగా మెదలాలని తెలిపారు. వీధి కుక్కలను చంపడం, తరలించడం, హింసించడం చట్ట రీత్యా నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.