Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 21 January 2023, 9:52 pm Posted by : anjudega

ఉపాధ్యాయ దంపతుల ఆందోళన ఉద్రిక్తం.. విలపించిన చిన్నారులు

లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ దంపతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో ఉపాధ్యాయ దంపతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భార్య భర్తలు ఒకే చోట పనిచేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ దంపతులు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి రణరంగంగా మారింది. లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌస్ ఫోరమ్ పిలుపునిచ్చింది. దీంతో కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుంటున్న ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులలో వచ్చిన ఉపాధ్యాయ దంపతులు.. పిల్లలతో సహా కమిషనర్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కాండంతో పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉపాధ్యాయ దంపతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో వారి వెంట చిన్నారులు విలపించారు. మరో పక్క కొంత మంది పోలీసులు చిన్నారులను చేరదీసుకొని.. వారి తల్లిదండ్రులను ఈడ్చుకుంటూ వాహనాల్లో తరలించారు. దాదాపు గంట పాటు అరెస్టుల పరంపర కొనసాగడంతో.. కొందరు ఉపాధ్యాయులు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

19 జిల్లాల్లో బదిలీలకు అనుమతించిన ప్రభుత్వం మరో 13 జిల్లాల్లో ఆపేయడం న్యాయమా? అని ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నించారు. వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.