దాదాపు నెలరోజుల వ్యవధిలోనే భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముగ్గురూ వింత వ్యాధితో చనిపోయారని అందరూ భావించారు.
భర్త ఆత్మహత్యతో అనుమానాలు
భార్యాపిల్లలతో శ్రీకాంత్
ఆంజనేయులు న్యూస్, కరీంనగర్ జిల్లా: దాదాపు నెలరోజుల వ్యవధిలోనే భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముగ్గురూ వింత వ్యాధితో చనిపోయారని అందరూ భావించారు. ఇంతలోనే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధరలో చోటుచేసుకుంది. నలుగురూ విగతజీవులైన విషాదాంతం మిస్టరీగా మారింది. మొదట్లో వింత వ్యాధి సోకి తల్లి, ఇద్దరు బిడ్డలు మృతి చెందారని అంతా భావించగా.. భర్త విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తల్లీబిడ్డల మృతికి విష ప్రయోగం కారణమై ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గంగాధరకు చెందిన వేముల శ్రీకాంత్ కరీంనగర్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో ప్రైవేటు అధ్యాపకుడు. అతడికి భార్య మమతతో పాటు అయిదేళ్ల కూతురు అమూల్య, 20 నెలల బాబు అద్వైత్ ఉన్నారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఈ ఏడాది నవంబరు 16న అద్వైత్, డిసెంబరు 4న అమూల్య మృతి చెందారు. ఇది జరిగిన కొన్నాళ్లకే మమత వాంతులు విరేచనాలతో డిసెంబరు 18న హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మమత మృతదేహానికి పంచనామా నిర్వహించి ఆమె శరీర అవయవాలైన కిడ్నీ, గుండె, కాలేయం, పేగులను భద్రపరిచి నమూనాలను హైదరాబాద్ తో పాటు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. శ్రీకాంత్ వద్ద భార్య చికిత్స సమయంలోని రక్తనమూనా పరీక్షల పత్రాలు పోలీసులు, ఆస్పత్రి వర్గాల దృష్టికి వచ్చాయి. అందులో ఉన్న ఫలితం ఆధారంగా మమత శరీర భాగాల్లో విషపదార్ధం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇంతలోనే శ్రీకాంత్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. దీంతో పోలీసులు తల్లీబిడ్డల మరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మమత నమూనాలకు సంబంధించి రెండుమూడు రోజుల్లో అధికారికంగా వచ్చే నివేదికల ఆధారంగా మరణాలు మిస్టరీని తేల్చేలా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. కరీంనగర్ సీపీ ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేయిస్తున్నారు.