Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 December 2022, 6:46 am Posted by : Anjaneyulu Dega

సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి

జిల్లాలో సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసరమైతే తప్ప సిజేరియన్ చేయకూడదు.

మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసరమైతే తప్ప సిజేరియన్ చేయకూడదని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి.సుబ్బారాయుడుతో కలిసి సాధారణ ప్రసవాలు, మాతా శిశు కేంద్రం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మహిళలు గర్భం దాల్చిన వెంటనే వారి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని, సమయానుసారంగా అవసరమైన పరీక్షలు చేయించుకునేలా వైద్య సిబ్బంది గర్భిణులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తమ పరిధిలోని గర్భవతులకు పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రసవాలు ఇంటి వద్ద కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగే విధంగా వివరించాలని తెలిపారు. సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం జరిగినట్లయితే అందించే కె.సి.ఆర్. కిట్లపై అవగాహన కల్పించి అందించాలని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలో సిజేరియన్ కాకుండా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా ఆసుపత్రుల వైద్యులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్టోబర్, నవంబర్ మాసాలలో జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగిందని, ఇదే స్ఫూర్తితో పూర్తి స్థాయిలో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు, వైద్యులు చొరవ చూపాలని తెలిపారు. మాతా శిశు కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ. శ్రీమన్నారాయణ, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు అరవింద్, వైద్యాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.