
ఆంజనేయులు న్యూస్, కరీంంనగర్ జిల్లా: కరీంనగర్ సమీపంలో తెల్లవారు జామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. షాట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న గోదాంలో తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ గోదాంలో గన్నీ బ్యాగులే ఉండడంతో అగ్ని కీలలకు సంచులన్నీ కాలి బూడిదయిపోయాయని అంచనా వేస్తున్నారు. సుమారు 40 వేల గన్నీ బ్యాగులు ఇందులో ఉన్నాయని, రూ. 12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గోదాం యజమానులు చెప్తున్నారు. అధికారులు మంటలు పూర్తిగా చల్లారిన తరువాత నష్టాన్ని అంచనా వేయనున్నారు.