దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోనీ ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే సీబీఐ సమాచారం అందించింది.
దిల్లీ మద్యం కేసులో వాంగ్మూలం నమోదు
సీఎంతో కవిత భేటీ
కార్యకర్తలెవరూ ఇంటికి రావద్దని సూచన
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే సీబీఐ సమాచారం అందించింది. కవిత విచారణ కోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ మొదట లేఖ రాయగా… ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ఆమె ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ ఆదివారం విచారిస్తామని సమాచారం ఇవ్వగా, కవిత అంగీకరించారు. ఈ నేపథ్యంలో కవిత శనివారం ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత ఆమెతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా… అవి ఫలించవని, సీబీఐ విచారణ దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు తెలిసింది. ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తమ ఇంటికి రావద్దని కవిత వారిని కోరినట్లు తెలుస్తోంది. ఆమె ఇంటిమార్గంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. కవిత నివాసం వద్ద భారాస నేతలు భారీగా ప్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్ (యోధుని కుమార్తె.. ఎన్నటికీ భయపడదు) అని వాటిపై రాశారు.