Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 November 2022, 4:59 pm Posted by : Anjaneyulu Dega

నాపై ఈగ వాలినా కేంద్ర ప్రభుత్వం ఊరుకోదు: ఈటల

మునుగోడు నియోజకవర్గంలోని పలివెల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని కొందరు అడ్డుకుంటే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని కొందరు అడ్డుకుంటే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పథకం ప్రకారం తన కాన్వాయ్ పైన దాడి చేశారని ఆయన ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. పలివెల గ్రామంలో తన సతీమణి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తుంటే అసభ్య పదజాలంతో దూషించారని ఈటల ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ప్రచారం చేస్తుంటే తాము అడ్డుకున్నామా? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కరే బయటకు వెళ్లినా సురక్షితంగా ఇంటికి చేరేవాళ్లమని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. తెరాస మీటింగ్ వద్దకు వంద మంది భాజపా కార్యకర్తలు వెళితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. తెరాస దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలే బొంద పెడతారన్నారు. తనపై ఈగ వాలినా భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఊరుకోదని ఈటల హెచ్చరించారు.