దేశంలో రక్త అవగాహన కోసం కిరణ్ వర్మ 28 డిసెంబర్ 2021న తిరువనంతపురం నుండి ప్రారంభించిన 21 వేల కిలోమీటర్ల నడక శనివారం జిల్లాకు చేరుకుంది.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రక్తదానం కోసం వేల కిలోమీటర్లు నడక కొనసాగిస్తూ అవగాహన కల్పించడంలో కిరణ్ వర్మ కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. దేశంలో రక్త అవగాహన కోసం కిరణ్ వర్మ 28 డిసెంబర్ 2021న తిరువనంతపురం నుండి ప్రారంభించిన 21 వేల కిలోమీటర్ల నడక శనివారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా కిరణ్ వర్మ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానంపై కిరణ్ వర్మ విశేష కృషి చేశారని, కిరణ్ వర్మ ప్రారంభించిన అతి సుదీర్ఘమైన రక్త అవగాహన ప్రచారం 2 సంవత్సరాల పైగా కొనసాగుతుందని తెలిపారు. అనంతరం కిరణ్ వర్మ మాట్లాడుతూ 31 డిసెంబర్ 2025 తర్వాత దేశంలో రక్తం కోసం ఎదురుచూస్తూ ఎవరూ చనిపోకూడదని, ప్రజలకు రక్తదానం గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా నడక కొనసాగుతుందని తెలిపారు. బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులు రక్త నిల్వల కొరత లేకుండా 5 మిలియన్ల మంది రక్తదానం చేయాలని ప్రోత్సహించడం జరుగుతుందని, ఇప్పటి వరకు 114 జిల్లాల గుండా 8 వేల 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించడం జరిగిందని, వివిధ ప్రాంతాల్లో 73 రక్తదాన శిబిరాలు నిర్వహించబడి తద్వారా 12 వేల 821 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం జరిగిందని, శిబిరాలు కాకుండా 3 వేల మందికి పైగా వ్యక్తిగత దాతలు రక్తదానం చేశారని తెలిపారు. సెప్టెంబర్ 15, 2022 న హైదరాబాద్‌లో పి.వి. నరసింహారావు పేరుతో ఆయన కుటుంబ సభ్యులు నిర్మించిన బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వారణాసిలో 3.5 కిలోమీటర్ల మారథాన్ కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు.