Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 October 2022, 6:57 pm Posted by : Anjaneyulu Dega

ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్ఐ ఆత్మహత్య.?

రైలు కింద పడి ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్ఐ రమణ(26) ఆత్మహత్య చేసుకున్నారు. మౌలాలి సమీపంలోని రైల్వేట్రాక్పై ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రైలు కింద పడి ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్ఐ రమణ (26) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మౌలాలి సమీపంలోని రైల్వేట్రాక్ పై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన రమణ… 2020లో పోలీస్ శాఖలో ట్రైనీ ఎస్ఐగా విధుల్లో చేరారు. ప్రస్తుతం ప్రొబేషనరీ ఎస్ఐగా ఉన్న ఆయన.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఎస్ఐ ప్రతాప్, ముగ్గురు స్నేహితులతో కలిసి చిక్కడపల్లి అశోక్ నగర్ లో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పని ఉందంటూ బయటకు వెళ్లారు.
గురువారం ఉదయం మౌలాలి – చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య బీ క్యాబిన్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా రైల్వే కీమ్యాన్ వెంకటేశ్వర్ రావు గుర్తించారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అధికారుల ద్వారా జీఆర్పీ పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలానికి జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఉన్న సెల్ఫోన్ ఆధారంగా మృతుడిని ఎస్ఐ రమణగా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం అందించి అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ సీఐ ఎం.శ్రీను తెలిపారు.