మీ ఊళ్లో నాటుకోళ్ల జాడ ఉంటే జర చెప్పండన్నా. హైదరాబాద్ నుంచి వచ్చిన మా నాయకులు అదైతేనే తింటారట’. అంటూ మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు కనిపించినవారినల్లా అడుగుతున్నారు.
ఆంజనేయులు న్యూస్, నాంపల్లి: ‘మీ ఊళ్లో నాటుకోళ్ల జాడ ఉంటే జర చెప్పండన్నా.. హైదరాబాద్ నుంచి వచ్చిన మా నాయకులు అదైతేనే తింటారట’. అంటూ మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు కనిపించినవారినల్లా అడుగుతున్నారు. రోజూ ఉదయాన్నే నాటుకోళ్ల కోసం అన్వేషించడం వీరికో పనిగా మారింది. మూడు ప్రధాన పార్టీలు వందమంది ఓటర్లకు నలుగురి చొప్పున ఇన్ఛార్జులను నియమించాయి. మొత్తంగా సుమారు 40 వేల మంది నాయకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి.. గ్రామాల్లో తిష్ఠ వేశారు. వారిలో చాలామందికి నాటుకోడి కూర ఉంటే తప్ప ముద్ద దిగడంలేదు. దీంతో ఊళ్లల్లో కోళ్లు దొరక్క గ్రామస్థాయి నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న ఓ నాటుకోళ్ల ఫాంలో ఉన్న 300 కోళ్లు ఒక్కసారిగా అయిపోవడం డిమాండ్ కు నిదర్శనం. కిందిస్థాయి నాయకులకు, కార్యకర్తలకు బాయిలర్ చికెన్ తో భోజనాలు వడ్డిస్తున్నారు. ఈ కోళ్ల ధరలకు రెక్కలొచ్చి.. కిలో రూ.250 పైనే పలుకుతున్నా ఎవరూ తగ్గడంలేదు. నాంపల్లిలోని ఓ చికెన్ సెంటర్ లో ప్రచారానికి ముందు రోజూ క్వింటల్ చికెన్ అమ్మేవారు. ప్రస్తుతం అయిదు క్వింటాళ్లకు పైనే విక్రయిస్తున్నట్లు దుకాణం యజమాని చెప్పారు.