Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 October 2022, 10:06 pm Posted by : Anjaneyulu Dega

కొమురంభీం వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: లోని కెరమెరి మండలం జోడేఘాట్ లో ఆదివారం (అక్టోబర్ 9) నిర్వహించనున్న ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ 82వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జోడేఘాట్ లో కొనసాగుతున్న కొమురం భీం వర్ధంతి వేడుకల పనులను సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ – ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి. నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఆదివారం జరుగునున్న కొమరం భీమ్ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర ఐ. టి పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేడుకకు వచ్చే ప్రజలకు భోజనం, త్రాగునీరు అందించుటలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, హాట్టి నుండి జోడేఘాట్ వరకు అవసరమైన బస్ లను నడపాలని ఆర్.టి.సి. అధికారులకు సూచించారు.

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై శాఖల ద్వారా స్టాళ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దర్బార్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.