Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 October 2022, 4:48 pm Posted by : Anjaneyulu Dega

మాకు కాంగ్రెస్ తోనే పోటీ: మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో తెరాసకు కాంగ్రెస్ పార్టీనే పోటీయని తెలిపారు. మునుగోడులో తెరాస అభ్యర్థి గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: అమ్ముడు పోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు ఉండదని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి.. మునుగోడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి భాజపాలోకి వెళ్లినట్లు బహిర్గతమైంది. ఆర్నెళ్ల క్రితం రూ.18వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చినట్లు నిన్న రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి.. త్యాగాలు చేశాననటం హాస్యాస్పదంగా ఉంది. ఏ కారణం వల్ల మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందో రాజగోపాల్ చెప్పాలి. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు వస్తున్న ఆదరణను చూసి కుట్రతోనే మునుగోడు ఎన్నికను తెచ్చారు. భాజపా అభ్యర్థికి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలు అమలవుతాయి.. మోటార్ల మీటర్లు వస్తాయి. మునుగోడులో తెరాస అభ్యర్థి గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. తెరాసకు కాంగ్రెస్ పార్టీనే పోటీ” అని జగదీశ్ రెడ్డి తెలిపారు.