
అద్దాలు పగలగొట్టిన భద్రతా సిబ్బంది
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నగరంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం హరిత ప్లాజా వైపు అమిత్ షా కాన్వాయ్ వెళ్లిన సమయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. హరిత ప్లాజా వద్ద ఆగిన సమయంలో కాన్వాయ్ కు అడ్డంగా ఓ కారు వచ్చింది. దీంతో కాన్వాయ్ ముందుకు వెళ్లలేదు. సదరు వ్యక్తి కారును పక్కకి తీయకపోవడంతో అమితా షా భద్రతా సిబ్బంది ఆ వాహనం అద్దాలను పగలగొట్టారు. అమితా షా కాన్వాయ్ కు కారు అడ్డంగా పెట్టిన వ్యక్తిని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ యాదవ్ గా గుర్తించారు.
ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి: లక్ష్మణ్
ఈ ఘటనపై భాజపా ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రహోంశాఖ మంత్రి పర్యటనలోనే భద్రతా వైఫల్యం ఉంటే ఇతరులను ఎలా రక్షిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో అస్సాం సీఎం పర్యటనలోనూ ఇలాగే జరిగిందని.. ఈ వైఫల్యానికి బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.