Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 September 2022, 3:00 pm Posted by : Anjaneyulu Dega

అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చిన సీఎం: ఈటల రాజేందర్

ఆంజనేయులు న్యూస్, చౌటుప్పల్: నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని, అమవీరుల స్తూపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లో ఐలమ్మ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటున్న కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే.. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చిన సీఎం కేసీఆర్.. చెల్లని రూపాయిగా మిగిలిపోయారని విమర్శించారు.