Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 September 2022, 11:16 pm Posted by : Anjaneyulu Dega

పొగాకు వినియోగం అభివృద్ధికి ఆటంకం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పొగాకు వినియోగం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కోల్పోవడంతో పాటు అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, పొగాకు నియంత్రణకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో డి.సి.పి. అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

పొగాకు, సంబంధిత ఉత్పత్తుల నియంత్రణ దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలను విద్యార్థినీ, విద్యార్థులకు వివరించాలని, జిల్లా వ్యాప్తంగా పొగాకు నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో పొగత్రాగడం, పొగాకు ఉత్పత్తులపై ప్రచారం నిషేధించడం జరిగిందని, అతిక్రమించిన వారికి జరిమానా విధించడంతో పాటు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పొగాకులో ఉండే 4 వేల రకాల రసాయనాల కారణంగా 60 రకాల క్యాన్సర్లు సంభవిస్తాయని, మొత్తం క్యాన్సర్ మరణాలలో 90 శాతం పొగాకు సేవించడం ద్వారా జరుగుతున్నాయని, పొగ త్రాగేవారితో పాటు ఆ పొగను పీల్చడం కూడా ప్రమాదకరమేనని తెలిపారు. విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పొగాకు నియంత్రణ దిశగా వైద్య-ఆరోగ్యశాఖ, పోలీసు, విద్య, సేల్స్ టాక్స్, కార్మిక, వ్యవసాయ విస్తర తదితర శాఖలతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో అక్రమ విక్రయాలు, బహిరంగ ధూమపానం పై పూర్తి స్థాయి పర్యవేక్షణ జరుపాలని తెలిపారు. వయస్సు అర్హత లేని వారికి పొగాకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పొగాకు నియంత్రణ కార్యక్రమం సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి. సుబ్బారాయుడు, ప్రోగ్రాం అధికారి డా॥ విజయపూర్ణిమ, నోడల్ అధికారి లింగారెడ్డి, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, వైద్యాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.