Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 September 2022, 11:48 am Posted by : Anjaneyulu Dega

42 ఏళ్ల వ్యక్తికి ఆసరా పింఛన్.. అవాక్కయిన ఎమ్మెల్యే

అనర్హుడికి పింఛను మంజూరుతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి..
దిగువన లబ్దిదారు మల్లేశ్ (అంతర చిత్రంలో..)

ఆంజనేయులు న్యూస్ నారాయణపేట జిల్లా: నిండా యాభై ఏళ్లు అయినా లేని ఓ అనర్హుడికి ఆసరా పింఛను మంజూరవడంపై నారాయణపేట ఎమ్మెల్యే అవాక్కయ్యారు. పింఛను పొందేందుకు సరిపడా వయసులేని వ్యక్తిని లబ్ధిదారుడిగా ఎంపిక చేయడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరు అయిన పింఛను ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. వాటిని పంపిణీ చేస్తుండగా.. ధ్రువపత్రం తీసుకోవడానికి వచ్చిన మరికల్ కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తిని చూసి ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. “నీకు 50 ఏళ్లు. కూడా లేవు కదా.. వృద్ధాప్య పింఛను ఎలా మంజూరు అయింది?” అంటూ ఆరా తీశారు. ఆ వ్యక్తి వద్ద ఉన్న ఆధార్ కార్డును పరిశీలించగా.. దానిపై 61 సంవత్సరాలుగా ఉంది. దీంతో, సుమారు 42 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఆధార్ కార్డుపై 61 సంవత్సరాలు నమోదవడం ఏంటీ అని ఎమ్మెల్యే విస్తుపోయారు.

ఆధార్ కార్డులో వయసు తప్పుగా నమోదు కావడం, క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించకుండా అనర్హుడికి పింఛను మంజూరు చేయడం పట్ల అధికారులపై మండిపడ్డారు. ఆధార్ కార్డులు, దరఖాస్తుదారుల వాస్తవ వయసును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.