Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 September 2022, 8:19 am Posted by : anjudega

సీఎం కేసీఆర్ తో సీపీఎం నేతల భేటీ… ఏం చర్చించారంటే?

హైదరాబాద్: తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, అందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యతగా తిప్పికొడదామని ప్రజాస్వామిక, లౌకికవాద శక్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల మధ్య విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసిరావాలని బుద్ధిజీవులు, మేధావులను సీఎం ఆహ్వానించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు పలు రాజకీయ, జాతీయ అంశాలపై వారు చర్చించారు.

స్వార్థరాజకీయాల కోసం విచ్ఛిన్నకర శక్తులు పచ్చని తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజాపక్షం వహించే రాజకీయవేత్తలు కదిలిరావాలన్న పిలుపునకు స్పందించి.. మద్దతు ప్రకటించేందుకు ముందుకు వచ్చిన సీపీఎం పార్టీకి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మత విద్వేష శక్తులను ఎదుర్కొనేందుకు కేసీఆర్ చేస్తున్న పోరాటంలో సంపూర్ణ మద్దతు అందిస్తామని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 20 సమస్యలపై సీపీఎం నేతలు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.