Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 September 2022, 9:03 pm Posted by : Anjaneyulu Dega

స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలలో ఈ నెల 5 నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న స్వఛ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో స్వచ్ఛ గురుకుల్ గోడప్రతలను ఆవిష్కరించి కార్యక్రమ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల ఆవరణ, వంటశాల, భోజనశాల, తరగతి గదులు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలల్లో అవసరమైన ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ సామాగ్రి, కంప్యూటర్లు, సి.సి. కెమెరాలకు మరమ్మత్తులు చేయించాలని, పాఠశాలల భవనాలు శు భ్రపర్చాలని, ఆవరణలోని పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి నాటిన మొక్కలు సంరక్షించాలని తెలిపారు. మూత్రశాలలు, నీటి ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థ ఇతరత్రాలను శుభ్రంగా నిర్వహించాలని, ప్రహారీగోడలు, చెట్లు, వంటశాలలకు పెయింటింగ్ చేయించాలని, దోమలు, కీటకాలు వృద్ధి చెందకుండా యాంటీ-లార్వా మందులు వినియోగించాలని తెలిపారు.

స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా రోజు వారి కార్యక్రమాలు కేటాయించడం జరిగిందని, మొదటి రోజు చెత్త, డిస్పోజల్ వ్యర్థాల తొలగింపు, రెండవ రోజు పాఠశాల భవనం, పరిసరాల శుభ్రత, మూడవ రోజు మూత్రశాలలు, నీటి ట్యాంక్ ల పారిశుద్ధ్యంతో పాటు పరిశుభ్రత ఆవశ్యకతపై పోటీలు నిర్వహించడం జరుగుతుందని, నాలుగవ రోజు వంటశాల, భోజనశాల పరిశుభ్రత, ఐదవ రోజు మొక్కలు నాటుట, ఆరవ రోజున పారిశుద్ధ్యంపై సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత అధికారులు కార్యక్రమ విజయవంతం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.