Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 August 2022, 10:22 am Posted by : Anjaneyulu Dega

మనోనేత్రంతో చూస్తాడు.. పనులన్నీ చేస్తాడు..

మోటారును తీయడానికి బావిలోకి దిగుతున్న రాజయ్య

ఆంజనేయులు న్యూస్: విశ్వంలో మానవ మేధకు అందని వింతలెన్నో.. మనుషుల్లోనూ విభిన్న సామర్థ్యాలు ఊహకు అందకుండా ఉంటాయి. కంటిచూపులేని వ్యక్తి ఏ సహాయం లేకుండా ఊరంతా తిరగడం, 62 ఏళ్ల వయసులోనూ నీటి బావుల్లోకి దిగి పాడైన మోటార్లను బయటికి తీయడం, వాటికి మరమ్మతులు చేయడం.. తనవంట తాను చేసుకోవడం.. ఇవన్నీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాస్తవం కూడా. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపురం గ్రామానికి చెందిన చింతం రాజయ్య విశేషాలివి. ఆయన ఆరేళ్ల వయసులో కళ్లు కోల్పోయారు. అయినా వాళ్ల నాన్న ఈత నేర్పించడంతో అందులో ప్రావీణ్యం సంపాదించారు. కంటిచూపు లేకున్నా వ్యవసాయ మోటార్ల మరమ్మతులపై పట్టు సాధించారు. బావుల్లోకి దిగి పాడైన మోటార్లను తీయడం, వాటికి మరమ్మతులు చేయడం ద్వారా కొంత ఆర్జించి ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తున్నారు.                               మోటర్ మరమ్మత్తులు చేస్తూ

పొలాల్లోని బావుల దగ్గరకు ఎవరి సాయం లేకుండానే వెళ్లి వస్తారు. వారసత్వంగా వచ్చిన పెంకుటింట్లో ఉంటున్నారు.  తల్లిదండ్రులు చనిపోయాక కొన్నాళ్లు ఆయనను పెద్దన్నయ్య చేరదీసి అన్నం పెట్టారు. ఆయనా చనిపోవడంతో.. ఎవరిపైనా ఆధారపడొద్దని నిర్ణయించుకుని గ్యాస్ పొయ్యి మీద వంట చేయడం నేర్చుకున్నారు. ఇంట్లో కాలక్షేపం కోసం ఓ టీవీ పెట్టుకున్నారు. బొమ్మ కనిపించకున్నా ఎవరు ఏమిటో చెప్పగలరు. హీరో నాగార్జున సినిమాలంటే ఇష్టమని చెబుతారు రాజయ్య. కాళ్లకు చెప్పుల్లేకపోతే ఊరిలో దారుల్ని సులువుగా గుర్తించగలనని వివరించారు..                కర్ర సాయం లేకుండా ఊర్లోకి నడుచుకుంటూ వస్తూ