Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 August 2022, 7:02 am Posted by : Anjaneyulu Dega

గవర్నర్ కు భాజపా నేతల వినతి.

హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు, సీఎం మెప్పు పొందేందుకు పాదయాత్రపై దాడులకు పాల్పడుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. భాజపా తెలంగాణ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం రాజభవన్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలిశారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.

“ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించేందుకు అనుమతించాలని, భద్రత కల్పించాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించాలి. నిన్న హైదరాబాద్ లో భాజపా కార్యకర్తలపై పోలీసులు, తెరాస కార్యకర్తలు జరిపిన దాడిపై విచారణ జరిపించాలి. జనగామలో ప్రజా సంగ్రామ యాత్రపై దాడికి కుట్ర పన్నిన తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై విచారణ జరిపించాలి. బండి సంజయ్ అక్రమ అరెస్టు, యాత్ర అడ్డగింతకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలి” అని వినతిపత్రంలో పేర్కొన్నారు.

గవర్నర్ తో భేటీ అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ కేసును పక్కదారి పట్టించేందుకు పాదయాత్ర అడ్డుకున్నారని ఆరోపించారు. యుద్ధ వాతావరణానికి తెరలేపిన కేసీఆర్.. రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కవితపై ఆరోపణలు వస్తే కేసీఆర్ మాట్లాడటం లేదని మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. డీకే అరుణ, రఘునందన్ రావు,  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, రాంచందర్ రావు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు గవర్నరు కలిసిన భాజపా బృందంలో ఉన్నారు.