Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 August 2022, 10:49 pm Posted by : Anjaneyulu Dega

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మృతి.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి తండాకు చెందిన సురేశ్ రాథోడ్ ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. మధ్యాహ్నం అతని స్నేహితులు గదికి వెళ్లే సరికి లోపలి నుంచి తాళం వేసి ఉంది. అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. సురేశ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్టు ఆర్ఎంవో డాక్టర్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. కుటుంబసభ్యులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు. ముందు జాగ్రత్తగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరో వైపు విద్యార్థి సురేశ్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై నిర్మల్ జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ… వ్యక్తిగత కారణాలతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అతని సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, పూర్తి వివరాలు శవపరీక్ష తర్వాత వెల్లడిస్తామన్నారు. మరో వైపు నిర్మల్ ఆసుపత్రి వద్ద భాజపా, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.