Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 August 2022, 2:50 pm Posted by : Anjaneyulu Dega

దిల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెరాస ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. దిల్లీ భాజపా నేతలు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. తనపై నిరాధార అరోపణలు చేస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న సహస్ర చండీయాగం, పూర్ణాహుతికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె వివరణ ఇచ్చారు.

“కుమార్తెను బద్నాం చేస్తే.. కేసీఆర్ వెనక్కి తగ్గుతారనుకుంటున్నారు. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేదిలేదు. కేంద్రాన్ని విమర్శిస్తోన్న ఆయన్ను మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నాలు తప్ప ఇవి మరొకటి కాదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం.. ఎవరికీ భయపడేది లేదు. మాది పోరాటం చేసే కుటుంబం. ఏ దర్యాప్తుకైనా మేం సిద్ధమే” అని కవిత వ్యాఖ్యానించారు.

పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్న కవిత

తనపై ఆరోపణలు చేసిన ఢిల్లీ భాజపా నేతలపై పరువు నష్టం దావా వేసేందుకు ఎమ్మెల్సీ కవిత సిద్ధమవుతున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ భాజపా ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై ఆమె పరువునష్టం దావా వేయనున్నారు. దీని కోసం న్యాయనిపుణులతో కవిత చర్చలు జరుపుతున్నారు.