
బీదర్: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సైబర్ క్రైం విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోన్న గిరిధర్.. తన 10 మంది కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలోని కలబురిగి జిల్లా గార్గాపూర్ లో దత్తాత్రేయ స్వామి దర్శనానికి కారులో వెళ్తున్నారు. బీదర్ జిల్లాలోని బంగూరు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు కంటైనర్ ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిలో చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో – వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో నలుగురికి గాయాలయ్యాయి.
మృతులు గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేశ్ (2), డ్రైవర్ జగదీశ్ (35)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని బీదర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీదర్ తాలూకా మన్నల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.