
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: స్వాతంత్ర్య వజ్రోత్సవ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం దేశభక్తిని చాటే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగిందని, గ్రామపంచాయతీ, పురపాలక సంఘాల పరిధిలో దేశభక్తిని చాటే విధంగా ప్రతి రోజు ఒక ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి జాతీయ జెండాలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నందున ప్రభుత్వం 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనేలా కార్యక్రమ నిర్వహణ చేపట్టిందని, ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ , మంగళవారం జిల్లాలో కార్యక్రమాల నిర్వహణను లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి అనే ఉద్దేశ్యంతో జిల్లాలో 2 లక్షల 51 వేల జెండాలను ఇంటింటికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఎంతో సుసంపన్నమైన భారతదేశాన్ని బ్రిటీష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించారని, ఎన్నో ఉద్యమాలు, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాట యోధుల ప్రాణత్యాగాలతో కష్టపడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని నేడు మనందరం అనుభవిస్తున్నామని, మహనీయులు, పోరాట యోధులు చేసిన త్యాగాలు మరువకూడదని, దేశంపై మనకు ఉన్న ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని చాటాలని తెలిపారు. 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు గాంధీ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు దేశ అభివృద్ధిలో తమ వంతు కృషి చేయాలని, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మన దేశాన్ని మరిచిపోకూడదని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలని, కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు, లింగబేధం లేని సమానత్వంతో అందరం భారతీయులమనే భావన కలిగి ఉండాలని తెలిపారు. దేశ చరిత్ర తెలుసుకోవాలని, భావి తరాలకు తెలియజేయాలని, అందరం ఐకమత్యంతో ఉండాలని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను లెక్క చేయకుండా దేశ రక్షణ కొరకు, జాతీయ జెండా గౌరవాన్ని కాపాడేందుకు సైనికులు పోరాడుతున్నారని తెలిపారు. మహోన్నత విలువ కలిగిన జాతీయ జెండా ఎగురవేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అన్నింటి కంటే పైన జాతీయ జెండా ఎగరాలని, వస్త్రంతో చేసిన జెండాను మాత్రమే ఆవిష్కరించాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడాలని, అనంతరం జాగ్రత్తగా భద్రపరచాలని, బహిరంగ ప్రదేశాలలో పడవేయకూడదని తెలిపారు. జాతీయ జెండా వెనుక ఉన్న పోరాటాలు, త్యాగాలు, ఉద్యమాలతో సాధించుకున్న స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం అన్ని అంశాలు తెలుసుకోవాలని, జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను గౌరవించాలని తెలిపారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున పండుగ వాతావరణం కనిపించేలా ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, మంచిర్యాల మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.