
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
మంచిర్యాల జిల్లా: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన స్వతంత్ర్య భారత వజ్రోత్సవ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, వజ్రోత్సవ వేడుకలలో నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ సిద్దం చేసుకోవాలని, ఆగస్టు 10న ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడం పార్క్ క్రింద కనీసం 75 మొక్కలు నాటాలని, 11న ఉదయం 6.30 నుంచి 8.00 గంటల వరకు ప్రతి మండల కేంద్రంలో ఫ్రీడం రన్ నిర్వహించాలని ఆదేశించారు. ఫ్రీడం రన్ నిర్వహణలో స్థానిక పోలీస్ అధికారులు చురుగ్గా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, ప్రభుత్వ సిబ్బందిని భాగస్వామ్యం చేస్తూ పకడ్బంధీగా ఫ్రీడం రన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
12న జాతీయ సమైక్యత కోసం రక్షాబంధన్ నిర్వహణ, అగస్టు 13న ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో జాతీయ జెండా, ఫ్లకార్డులతో.. విద్యార్థులు, ఉద్యోగులతో ఫ్రీడం ర్యాలీ నిర్వహించాలని, అనంతరం బెలూన్ గాల్లోకి వదలాలలని తెలిపారు. 14న ప్రతి నియోజకవర్గంలో జానపద కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని, 16న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని తెలిపారు. సామూహిక జాతీయ గీతాలాపన కోసం ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డు, ప్రతి ముఖ్యమైన కూడలి, ట్రాఫిక్ జంక్షన్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రతి విద్యాసంస్థ, వాణిజ్య ప్రదేశాలలో, కార్యాలయాల్లో గీతాలపన జరగాలని, గీతాలాపన సమయంలో నిశబ్దం పాటించాలని, అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. 17న ప్రతి నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని, జిల్లాలో ప్రతి గ్రామం పరిధిలో క్రీడా పోటీలు నిర్వహించాలని, 11, 12 తేదీలలో గ్రామ స్థాయిలో, 13, 14 తేదీలలో మండల స్థాయిలో, ఆగస్టు 16,17 తేదీలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని తెలిపారు.
18న ఫ్రీడం కప్ చివరి పోటీలు నిర్వహించి విజేతలను నిర్ణయించాలని తెలిపారు. 19న జిల్లాలో ఉన్న ప్రతి వృద్ధాశ్రమం, ఆసుపత్రి, అనాథ శరణాలయంలో స్వీట్లు, పండ్లు పంపిణీ జరగాలని, 20న రంగోలి పోటీలు, 21న గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారంతో నివేదికలు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, జిల్లా అటవీ అధికారి శివాని దొంగ్రె, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.