Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 July 2022, 10:07 am Posted by : Anjaneyulu Dega

ప్రధాని నివాసాన్ని ముట్టడించనున్న కాంగ్రెస్!

దిల్లీ: ధరల పెరుగుదల, నిరుద్యోగంపై కాంగ్రెస్ గళమెత్తనుంది. ఆగస్టు 5న దేశవ్యాప్తంగా నిరసనలు తెలపనుంది. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లిన అనంతరం ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ని లోక్సభ, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించే కాంగ్రెస్ నేతలు ముందుగా పార్లమెంట్ వద్దకు చేరుకొని రాష్ట్రపతి భవన్ కు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలపనున్నారు. అక్కడి నుంచి ప్రధాని నివాసాన్ని ముట్టడించనున్నారు. రాష్ట్రాల్లో గవర్నర్ల ఇంటి వద్ద వద్ద కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్షాలు గళమెత్తుతున్నాయి.

జీఎస్టీ, నిత్యావసరాలు, గ్యాస్, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్లకార్డులు చేతబట్టి, వెల్ లోకి దూసుకొచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో వివిధ పార్టీలకు చెందిన 19మంది రాజ్యసభ సభ్యులు, మరో నలుగురు కాంగ్రెస్ లోక్సభ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. వీరితో పాటు పార్లమెంట్ బయట నిరసన చేపట్టిన ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.