Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 July 2022, 11:06 pm Posted by : Anjaneyulu Dega

క్యాసినో వ్యవహారం.. సినీతారలకు ఈడీ నోటీసులు?

హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. నేపాల్లో క్యాసినోకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీతారలపై ఈడీ దృష్టి సారించింది. క్యాసినోకు ప్రచారం చేసిన సినీతారలు రూ. లక్షల్లో పారితోషికం తీసుకున్నట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. పారితోషికం తీసుకున్న సినీతారలకు నోటిసులు ఇచ్చే యోచనలో ఈడీ ఉన్నట్టు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో సినీతారల ప్రచార దృశ్యాలను చీకోటి ప్రవీణ్ అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే. ప్రవీణ్, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న ఈడీ అధికారులు కొందరు సినీ ప్రముఖులకు నగదు బదిలీ అయినట్టు గుర్తించారు. క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్ చీకోటి, మాధవరెడ్డిలకు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బషీర్బాగాలోని ఈడీ కార్యాలయంలో తమ ఎదుట సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిన్న ఉదయం 8గంటలకు నుంచి ప్రారంభమైన ఈడీ సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. ఐఎస్ సదన్ లోని ప్రవీణ్ ఇంటితో పాటు కడ్తాల్లో ఉన్న ఆయన ఫామ్ హౌస్లోనూ సోదాలు చేశారు. బోయినపల్లిలోని మాధవరెడ్డి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. 8 బృందాలుగా ఏర్పడిన ఈడీ అధికారులు 16గంటలకు పైగా తనిఖీలు చేశారు. ప్రవీణ్ ఇంట్లో చరవాణి, ల్యాప్టాప్తో పాటు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి నివాసంలో బ్యాంకు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

ఈఏడాది జనవరి, జూన్ మాసాల్లో ప్రవీణ్, మాధవరెడ్డి కలిసి నేపాల్లో భారీ ఎత్తున క్యాసినో నిర్వహించినట్టు ఈడీ అధికారులు తేల్చారు. దీనికోసం పలువురు సినీ తారలను ప్రచారకర్తలుగా ఉపయోగించుకున్నారు. వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి.. తెలుగు రాష్ట్రాల్లో చాలామందిని ఆకర్షించారు. శంషాబాద్ నుంచి నేపాలు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి క్యాసినోకు తీసుకెళ్లినట్టు ఈడీ గుర్తించింది. నేపాల్, థాయ్లాండ్, ఇండోనేషియాలో జరిగే క్యాసినోలకు ఇక్కడి నుంచే పేకాటరాయుళ్లను తీసుకెళ్లి భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.