
హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్ బొమ్మతో తాను ఎన్నికల్లో గెలవలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “పదవుల కోసం నేను తెలంగాణ ఉద్యమం, తెరాసలో చేరలేదు. నా సొంత పనితీరుతోనే ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాను. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించాలని కేసీఆర్ కుట్ర పన్నారు. మంత్రిగా ఉన్న నా ఇంట్లోనే ఎన్నికలప్పుడు తనిఖీలు జరిగాయి. నాతో పాటు మరో ముగ్గురు తెరాస నేతల ఓటమికి కుట్ర చేశారు. వారంతా ఓడిపోయారు. నేనొక్కడిని మాత్రమే గెలిచాను. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్ సహించరు. అతి విధేయంగా ఉండేవారినే నాయకుడిగా భావిస్తారు. హుజూరాబాద్ లో నేను గెలిస్తే పదవికి రాజీనామా చేస్తానన్న వ్యక్తి ఇప్పటికీ చేయలేదు.
నేను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని సవాలు విసిరా. కేసీఆర్ కు దమ్ముంటే హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని నా సవాల్. గజ్వేల్ లో పోటీ చేస్తా.. మీరు సిద్ధమా.. అని సవాల్ విసిరితే బానిసలతో తిట్టిస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించే దమ్ము, ధైర్యం కేసీఆర్ కు లేదు. ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. కేసీఆర్ ను ఓడించకపోతే ఈ జన్మకు సార్ధకత లేదు” అని ఈటల వ్యాఖ్యానించారు.