Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 25 July 2022, 10:47 pm Posted by : anjudega

గవర్నర్ పదవీ, రాజ్యసభ సీట్లకు బేరం.. రూ.100కోట్ల రాకెట్ గుట్టురట్టు

దిల్లీ: గవర్నర్ పదవి లేదా రాజ్యసభ సభ్యత్వం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టురట్టయ్యింది. పదవుల ఆశ చూపి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోన్న భారీ రాకెట్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఛేదించింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ.. ఫోన్ కాల్స్, వ్యక్తుల సంభాషణల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టి పలువురు నిందితులను అరెస్టు చేసింది. ప్రాథమిక విచారణలో భాగంగా ఇటువంటి మోసపూరిత హామీలతో దాదాపు రూ.100కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడేందుకు వీరు ప్రణాళికలు రచించినట్లు సీబీఐ గుర్తించింది.

ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన కమలాకర్ ప్రేమ్ కుమార్ బండ్గర్, కర్ణాటకలోని బెల్గామ్ కు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, దిల్లీకి చెందిన మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరాతోపాటు మొహమ్మద్ ఐజాజ్ ఖాన్లపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. సీనియర్ సీబీఐ ఆఫీసర్గా నటించిన బండ్గర్.. తనకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉన్నాయని బూరా, అరోరా, ఖాన్, నాయక్లలతో చెప్పుకున్నాడు. భారీగా నగదు వచ్చే ఎటువంటి పనినైనా చేసిపెడుతానని.. అటువంటి వాటిని తన వద్దకు తీసుకురావాలని సూచించాడు. కుట్రలో భాగంగా గవర్నర్ పదవి, రాజ్యసభ సీట్లతోపాటు కేంద్ర ప్రభుత్వశాఖల్లోని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమిస్తామని చెబుతూ ప్రైవేటు వ్యక్తులను మోసం చేసేందుకు ఈ ముఠా సిద్ధమైంది. గవర్నర్ పదవి లేదా రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయిస్తామని హామీ ఇస్తూ పలువురిని సంప్రదించినట్లు సమాచారం.

ఈ సమాచారం సీబీఐకి చేరడంతో రంగంలోకి దిగిన దర్యాప్తు విభాగం.. చివరకు ఈ ముఠాలోని నలుగురిని అరెస్టు చేసింది. వీరిపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ… దాదాపు రూ.100కోట్లకుపైగా వసూలు చేసేందుకు బేరసారాలు జరిపినట్లు ఆరోపించింది..