Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 19 July 2022, 10:56 pm Posted by : anjudega

నుపుర్ శర్మను చంపేందుకు వచ్చిన పాకిస్థానీ అరెస్టు.. అంగుళాల కత్తి గుర్తింపు!

దిల్లీ: మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా బహిష్కృత నేత నుపుర్ శర్మ ను చంపేందుకు అంతర్జాతీయ సరిహద్దు దాటుకొని దేశంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ పౌరుడు రాజస్థాన్ లో అరెస్టయ్యాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సంయుక్త బృందం అతడిని విచారిస్తోంది. ఈ నెల 16న రాత్రి 11గంటల సమయంలో హిందుమాల్కోట్ బోర్డర్ అవుటోపోస్ట్ వద్ద అనుమానాస్పద స్థితిలో కనబడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి అనుమానాస్పద స్థితిలో కనబడగా తక్షణమే అతడిని నిర్బంధంలోకి తీసుకొని విచారించినట్టు చెప్పారు. నిందితుడి వద్ద 11 అంగుళాల పొడవైన కత్తి, మతపరమైన సాహిత్యం, కొన్ని బట్టలతో పాటు అతడి సంచిలో ఆహారం, ఇసుకను గుర్తించినట్టు వివరించారు. తన పేరు రిజ్వాన్ అష్రఫ్ అని, పాకిస్థాన్ లొనీ నార్తన్ పంజాబ్ లొనీ మండీ బహుద్దీన్ పట్టణానికి చెందినవాడిగా చెప్పాడని సదరు అధికారి వెల్లడించారు.

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను చంపేందుకు సరిహద్దులు దాటుకొని వచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించాడన్నారు. అయితే, తన ప్రణాళికను అమలుపరచడానికి ముందు అజ్మీర్ దర్గాను సందర్శించాలనుకున్నాడని అధికారి తెలిపారు. అరెస్టు చేసిన తర్వాత తదుపరి విచారణ కోసం అతడిని స్థానిక పోలీసులకు అప్పగించగా.. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడంతో ఎనిమిది రోజులు పోలీస్ కస్టడీ విధించారని తెలిపారు. నిందితుడి గురించి సంబంధిత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వడంతో ఐబీ, రా, మిలటరీ ఏజెన్సీలతో కూడిన సంయుక్త బృందం అతడిని విచారిస్తోందన్నారు.