Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 July 2022, 11:12 pm Posted by : Anjaneyulu Dega

ముగ్గురు సహచరుల్ని కాల్చి చంపిన పోలీస్.. ఆ తర్వాత..!

దిల్లీ: ఓ పోలీస్ తన ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద పహారా కాస్తున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిక్కిం పోలీస్ కు చెందిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ విభాగానికి చెందిన 32 ఏళ్ల ప్రబిన్ రాయ్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో కమాండర్ పింటో నంగయాల్ భుటియా, ఇంద్రాలాల్ ఛెత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలపాలైన ధనంగ్ సుబ్బా అనే పోలీస్ ను డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు వివరించారు. అయితే, ప్లాంట్ వద్ద పహారా కాస్తున్న సమయంలో చెలరేగిన ఘర్షణే ఈ కాల్పులకు దారి తీసినట్టు సమాచారం.

ఈ కాల్పుల ఘటనపై మధ్యాహ్నం 3గంటల సమయంలో తమకు పీసీఆర్ కాల్ వచ్చినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. ముగ్గురు కింద పడి ఉన్నారన్నారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరు తీవ్ర గాయాలతో ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లామని.. అయితే, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు చెప్పారు. అయితే, ఆ తర్వాత నిందితుడు ప్రబీన్ రాయ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని తెలిపారు.