
వరంగల్: భారీ వర్షాల నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏటూరు నాగారంలోని ఐటీడీఏలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్షించారు. భారీ వర్షాలు కురిసినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికారయంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రతి శాఖ అధికారులు 3 షిఫ్టులుగా పనిచేసి లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సూచించారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని, ఎన్ని నిధులు ఖర్చయినా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదలశాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్ రూపొందించాలని సూచించారు. చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్న మిషన్ భగీరథ పైపులకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున.. వెంటనే మంజూరు చేస్తున్నట్టు సీఎం చెప్పారు.
పలు జిల్లాలకు నిధులు మంజూరు..

తక్షణ వరద సాయం కింద వివిధ జిల్లాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. ములుగు జిల్లాకు రూ.2.50కోట్లు, భద్రాచలం జిల్లాకు రూ.2.30కోట్లు, భూపాలపల్లి జిల్లాకు రూ. 2కోట్లు, మహబూబాబాద్కు రూ.1.50కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగులో ఒక హెలికాప్టర్, భద్రాచలంలో ఒక హెలికాప్టర్ సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్వేలు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సౌకర్యాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. శ్యాంపల్లి ఆర్అండీబీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, హరీశ్రావు, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.