
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో భారీ వర్షాలు, వరదలు కారణంగా జరిగిన నష్టాలపై మండలాల వారీగా సమగ్ర నివేదికలను సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో జరిగిన నష్టం, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలు, ఆస్తి, పంట నష్టం, బాధితులకు అందుతున్న సహాయం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. 
ఎడతెరపి లేని వర్షాల పంటలు బాగా దెబ్బతిన్నాయని, మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతు వారీగా వివరాలను సర్వేలో నమోదు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సహాయక చర్యలను కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కోవాల క్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోనేరు కోణప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
