
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనపై కాల్పులు జరగ్గా.. మధ్యాహ్నం ఎల్డీపీ వర్గాలు అధికారికంగా ఆయన మృతిని ధ్రువీకరించాయి. ఆయన నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అబె ఛాతీ పట్టుకుని వేదికపైనే కుప్పకూలారు. అత్యంత సమీపం నుంచి దేశీయ తుపాకీతో రెండు సార్లు ఈ కాల్పులు జరగడంతో అబె ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆయనను హుటాహుటిన హెలికాప్టర్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన శ్వాస తీసుకోవడంలేదని, హృదయం కూడా స్పందించలేదని స్థానిక ఫైర్ సిబ్బంది తెలిపారు. ఘటనాస్థలంలోనే షింజో మరణించినట్లు తెలుస్తోంది. దుండగుడు అబెకు వెనుక వైపు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉండి కాల్పులు జరిపినట్లు సమాచారం..