
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక తేదీ సమీపిస్తోన్న వేళ అభ్యర్థి ఎంపికపై భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఎన్నికకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నేడు భాజపా పెద్దలు వెంకయ్య నాయుడితో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం వెంకయ్య నివాసానికి చేరుకున్న పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ ఉదయం వెంకయ్య నాయుడు సికింద్రాబాద్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భాజపా నేతలతో భేటీ నిమిత్తం దిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ కానున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం సాయంత్రం భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల కోసం పలువురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు సహా 14 మంది నేతలతో భాజపా ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీతో జేపీ నడ్డా ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పలువురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు కూడా ఉంది. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రతిపక్ష పార్టీలు కూడా నేడు సమావేశం కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో యశ్వంత్ సిన్హాను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. రాష్ట్రపతి రేసులో ఉండేందుకు సిన్హా కూడా సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేశారు.