
ఆంజనేయులు న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ వందవ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. శత వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైన విషయం. అందుకే ప్రధాని మోదీ స్వయంగా శనివారం ఇంటికి వెళ్లి తల్లికి పుట్టిన రోజును జరిపారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మొదటగా గాంధీనగర్‌లోని తమ ఇంటికి వెళ్లారు. ఇవాళ 100వ పుట్టిన రోజు జరుపుకుంటున్న తన తల్లి హీరాబెన్‌కు శుభాకాంక్షలు తెలిపి స్వీట్ తినిపించారు. అనంతరం తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి పక్కన కూర్చొని.. ఆమెతో కాసేపు మాట్లాడారు. సరదాగా కబుర్లు చెప్పారు. కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఈ కార్యక్రమం జరిగింది.
తన పుట్టిన రోజు, తల్లి పుట్టిన రోజు సందర్భంగానే కాదు వీలుచిక్కినప్పుడల్లా తల్లి వద్దకు వెళ్తుంటారు ప్రధాని మోదీ. ఆమెతో పాటు భోజనం చేసి కాసేపు మాట్లాడతారు. ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి బాగోగులను తెలుసుకుంటారు.