Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 June 2022, 11:42 am Posted by : Anjaneyulu Dega

బ్రతికుండగానే రైతులను చంపేస్తున్నారు..!

జిల్లాలో నకిలీ మరణ ధ్రువపత్రాలు….

రైతు బీమా కోసం మరణశాసనం.

వలస వెళ్లిన వారే టార్గెట్

అధికారుల అండతో ధ్రువపత్రాలు జారీ.

పంపకాల్లో తేడాతో బయటపడిన వైనం

ఇద్దరు అరెస్టు రిమాండ్ కు తరలింపు

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్

జోగులాంబ గద్వాల జిల్లా: అవినీతికి అడ్డాగా మారిన జోగులాంబ గద్వాల జిల్లా మరో కొత్త కోణం బయటపడింది. చనిపోయిన రైతు కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బీమాను కొందరు అక్రమార్కులు అపహాస్యం చేస్తున్నారు. అధికారులతో చేతులు కలిపి బతికున్న రైతులను చనిపోయినట్లుగా సృష్టించి మరణ ధ్రువపత్రం లను తీసుకుంటూ ప్రభుత్వం అందించే రైతు బీమా రూ. 5 లక్షలను సునాయాసంగా కాజేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లా లోని గట్టు మండల కేంద్రంలో మల్లమ్మ .. అనే మహిళ పేరున రూ.5 లక్షలను తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ వివరాలను వెల్లడించారు…

గట్టు మండల కేంద్రానికి చెందిన మల్లమ్మ  బ్రతుకుదెరువు నిమిత్తం రాయచూరు కి వెళ్ళింది.  రైతుబంధు డబ్బులు కోసం గ్రామంలో వరసకు కొడుకు అయిన నాగరాజు కు తన పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన నాగరాజు అతని స్నేహితుడైన ఆల మంచి రాజు అలియాస్ రాజప్ప తో చేతులు కలిపి రైతు బీమా డబ్బులు కాజేసేందుకు కుట్ర పన్నారు. అదే గ్రామానికి చెందిన మాల నరసమ్మ చనిపోగా  ఆమె పేరుకు బదులుగా బ్రతికున్న మల్లమ్మ పేరున మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని గట్టు చెందిన అంగనవాడి టీచర్ శశిరేఖను మాయమాటలు చెప్పి నమ్మించారు. మరణ నివేదికను పంచాయతీ సెక్రెటరీ అయిన శుభవతి కి ఇచ్చారు. విచారణ చేస్తానని ఆమె చెప్పడంతో  నేను వార్డు నెంబర్ ని నా మాట నమ్మరా అని నాగరాజు ఆమెకు మాయమాటలు చెప్పి 2021 డిసెంబర్ 23న బ్రతికున్న మల్లమ్మ పేరున మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. మరణ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోగా 2022 ఫిబ్రవరి 15న రైతు బీమా రూ.5 లక్షలు ఎస్ బీ ఐ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. 18వ తేదీన మాల నాగరాజు, రాజప్ప ఇద్దరు కలిసి బ్యాంకులో రూ.3 లక్షల ను డ్రా చేశారు. రూ. 1 లక్ష రూపాయలు నాగరాజు తీసుకోగా.. రూ.2 లక్షల రూపాయలను రాజప్ప కు ఇచ్చాడు. మిగిలిన రూ.2 లక్షల రూపాయలు నాగరాజు ఒక్కడే తీసుకోవడంతో వారిద్దరు గొడవ పడ్డారు. దీంతో రాజప్ప విషయాన్ని బయట పెట్టడంతో వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి వీరిద్దరిపై గట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గట్టు ఎస్ఐ గద్వాల సీఐ ఆధ్వర్యంలో గురువారం మాల నాగరాజు, రాజప్పలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.