Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 May 2022, 9:45 am Posted by : Anjaneyulu Dega

సర్కారు స్థలమిస్తే.. అక్రమార్కులు అమ్మేసుకున్నారు!

న్యాయం కోసం పాక్కుంటూ అధికారుల చెంతకు బాధితుడు

ఆంజనేయుల న్యూస్, సంగారెడ్డి: పుట్టుకతోనే రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే చేతులకు చెప్పులు తొడుక్కొని పడుతూ లేస్తూ పోవాల్సిందే. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన 65 ఏళ్ల మొగులయ్య దైన్య పరిస్థితి ఇది. అలాంటి వ్యక్తికి చేయూత ఇవ్వాల్సిందిపోయి.. కొందరు ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని గుట్టుగా అమ్మేసుకున్నారు. తనకు గతంలో అధికారులు అందజేసిన జాగా వద్దకు ఇటీవల మొగులయ్య వెళ్లారు. అక్కడ ఇతరుల ఇల్లు నిర్మించుకుని ఉండడంతో కంగుతిన్నారు. లబోదిబోమంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సర్వే సంఖ్య 615లో 57వ నంబరుతో 100 గజాల ఇంటి స్థలాన్ని మొగులయ్యకు ఇచ్చారు. 2003లో దానికి పట్టా అందజేశారు. ఆయన భార్య అంధురాలు. కన్న కొడుకూ దూరమయ్యాడు. మొగులయ్య ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయారు. ఇంటి స్థలం ఖాళీగా ఉండటంతో కొందరు దీనిపై కన్నేశారు. ఇక్కడ గజం రూ.25 వేలకు పైగా పలుకుతుండటంతో ఆయనకు తెలియకుండానే ఇతరులకు అమ్మేశారు. అధికారులు స్పందించి తన స్థలం తిరిగి ఇప్పించాలంటూ సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణికి వచ్చి ఆయన తన ఆవేదన వెళ్లగక్కారు..