Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 May 2022, 10:14 am Posted by : Anjaneyulu Dega

దారుణం.. భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం.!

గుంటూరు జిల్లా: ఉమ్మడి గుంటూరు జిల్లాలో సామూహిక అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వారంరోజుల్లో నాలుగో ఘటన చోటు చేసుకోవడం స్థానికులను కలవరపెడుతోంది. తాజాగా బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేపల్లె రైల్వేస్టేషన్లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దుండగులు భర్తను కొట్టి వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధిత దంపతులు చెబుతున్నారు. అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్లో దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్లోని బల్లలమీద పడుకున్నారు.

ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు బల్లపై నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వారికి అడ్డుపడ్డ భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నిందితులను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత దంపతులు నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.