Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 March 2022, 5:20 pm Posted by : Anjaneyulu Dega

సాయుధ బలగాలకు 100 రోజుల సెలవులు.!

దిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF)కు చెందిన జవాన్ల కుటుంబాలకు గుడ్ న్యూస్ తమ  న్యూస్. ఏడాదిలో కనీసం 100 రోజులు తమ కుటుంబంతో గడిపేందుకు జవాన్లకు అనుమతించాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదన త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సెలవులకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పాలసీ అమలులో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే హోం శాఖ పలుమార్లు చర్చలు జరిపింది. ఈ నెల ప్రారంభంలోనూ సమావేశమైంది. జవాన్లపై పని ఒత్తిడి తగ్గించడం, అత్యంత సవాలుగా ఉన్న పలు ప్రాంతాల్లో కష్టతరమైన విధులను నిర్వహించే సుమారు 10 లక్షల మంది సైనికుల జీవితాల్లో ఆనందాన్ని నింపడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం. 100 రోజుల సెలవులను ఎలా అమలు చేయాలనే దానిపై హోం మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని సీఏపీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ విధానాన్ని ఎప్పుడో అమల్లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ.. కరోనా కారణంగా సమస్యలు తలెత్తినట్లు ఆయన వెల్లడించారు. జవాన్ల 100 రోజుల సెలవుల సమయంలో విధులకు ఆటంకం కలగకుండా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం, మహమ్మారి సంక్రమణను అరికట్టడం పైనా కేంద్రం దృష్టిసారించినట్లు అధికారి వివరించారు. 100 రోజుల సెలవులకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయని, అమిత్ షాతోపాటు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ సైతం ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం జవాన్లకు సంవత్సరంలో 60-65 రోజుల వరకు సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఈ సెలవుల విధానం అమలైతే కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీతో పాటు అస్సాం రైఫిల్స్, ఎన్ఎ, ఎన్టీఆర్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్న వారు సైతం లబ్ధి పొందే అవకాశం ఉంది..