Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 12 March 2022, 4:55 pm Posted by : Anjaneyulu Dega

డ్వాక్రా మహిళలకు తీపి కబురు..

హైదరాబాద్: రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం నిధులను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో శాసనసభ ప్రాంగణంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాలు మహిళలు రూ.545 కోట్ల వరకు పొదుపు చేసుకున్నారు. అప్పట్లో అభయ హస్తం కింద రూ.500 కంట్రిబ్యూటరీ <span;>పెన్షన్ కోసం ఈ పొదుపు చేశారు. అయితే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం కింద మొదట్లో రూ. వెయ్యి నుంచి ఇప్పుడు రూ.2016లు పెన్షన్ ఇస్తున్నారు. అప్పటి కంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్ వస్తున్న దృష్ట్యా.. మహిళలు సైతం అభయహస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని వారి కోరిక మేరకు ఆ నిధులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఈ నిధులు పేదరిక నిర్మూలన సంస్థ వద్దే ఉన్నందున ఆ మొత్తం తిరిగి ఇవ్వనున్నారు. మరో రెండు మూడు రోజుల్లోనే ఆ నిధులు ఆయా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.