Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 March 2022, 11:46 am Posted by : Anjaneyulu Dega

రామగుండం బొగ్గు గనిలొ ప్రమాదం.. కొనసాగుతోన్న సహాయక చర్యలు.

శిధిలాల నుంచి బయటపడ్డ బదిలీ వర్కర్ రవీందర్ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

పెద్దపల్లి జిల్లా: గోదావరిఖని రామగుండం-3 పరిధిలోని అడ్రియాల్ లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం సైడు పైకప్పు కూలడంతో ఒక అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగిస్తోన్న రెస్క్యూ టీం ఇప్పటివరకు ముగ్గురు కార్మికులను బయటకు తీసుకురాగలిగారు. గనిలో చిక్కుకుపోయిన సపోర్టుమెన్ వీరయ్య, నరేశ్, వెంకటేశ్వర్లును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సింగరేణి డైరెక్టర్లు బలరాం, చంద్రశేఖర్, సత్యనారాయణలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

కొద్దిసేపటి క్రితం శిథిలాల నుంచి బయటపడ్డ బదిలీ వర్కర్ రవీందర్ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలికి ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ కిట్లను పంపిస్తూ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. ప్రస్తుతం గని అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, ఒప్పంద కార్మికుడు తోట శ్రీకాంత్, మరో కార్మికుడి ఆచూకీ కోసం సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. యంత్రాలను వాడకుండా శిథిలాలు తొలగిస్తున్నందున సహాయ చర్యల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యంత్రాలు వాడితే శిథిలాల్లో చిక్కుకుపోయి కార్మికులు గాయపడే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా స్పష్టమైన సమాచారం లేదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..